ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు

  • కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు
  • ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్
  • టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్
  • భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటిదార్‌కు రావాల్సినంత గుర్తింపు రావడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. జట్టులో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు ఉండటం వల్లే పటిదార్ ప్రతిభ వెలుగులోకి రావడం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. ఆర్‌సీబీకి వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించిన విజయవంతమైన కెప్టెన్‌గా, కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా పటిదార్‌కు మరింత ప్రశంసలు దక్కాల్సి ఉందని క్లార్క్ పేర్కొన్నాడు.

ఇటీవల ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన క్లార్క్, ఐపీఎల్ 2026లో తన దృష్టిలో "అండర్ ది రాడార్ ప్లేయర్" (అంతగా గుర్తింపునకు నోచుకోని ఆటగాడు) పటిదారే అని అన్నాడు. "పటిదార్ ఈ టోర్నమెంట్‌లోనూ అద్భుతంగా రాణించాడు. జట్టులో కోహ్లీ ఉండటంతో ఎప్పుడూ అతని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ పటిదార్ ఒక కెప్టెన్‌గా అసాధారణ ప్రతిభ చూపాడు. తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు" అని ప్రశంసించాడు.

టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అత్యంత కష్టమని, కానీ పటిదార్ ఆ స్థానంలో వచ్చి విధ్వంసం సృష్టిస్తాడని క్లార్క్ కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పటిదార్ దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 501 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతని నాయకత్వ పటిమ, నిలకడైన ప్రదర్శన దృష్ట్యా భారత టీ20, వన్డే జట్లలోకి అతడిని కచ్చితంగా పరిగణించాలని క్లార్క్ సూచించాడు. "వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా, భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందు వరుసలో ఉండాలి" అని క్లార్క్ స్పష్టం చేశాడు.

Michael Clarke
Rajat Patidar
RCB
IPL

More Telugu News